వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు ఆధారంగా, దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ తుఫాను ప్రభావం తిరుమల దర్శనాలపై పడింది.
టీటీడీ ఈవో శ్యామల రావు గారు అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘాట్ రోడ్డులో కొండ చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అంతరాయాలు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఘాట్ రోడ్ లో అంబులెన్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లతో కాటు సిబ్బంది సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఏపీకి తుఫాను పొంచి ఉండడంతో టీటీడీ అప్రమత్తమైంది.భారీ వర్షాల కారణంగా తిరుమలలో ఈనెల 16వ తారీఖున విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.భక్తుల భద్రత కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కాబట్టి తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించి, అధికారులతో సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.