
తమిళనాడులో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలుపెడుతున్నాడు సూపర్ స్టార్ విజయ్. విల్లుపురంలో జరిగిన ‘తమిళగ వెట్రిక్ కళగం’ తొలి బహిరంగ సభలో విజయ్ దేవుడు లేడని చెప్పిన పెరియార్ వ్యాఖ్యలపై విభేదిస్తూ, మత రాజకీయాలను ప్రోత్సహించనని స్పష్టంచేశారు. రాజకీయాల్లో తానేంటో చూపిస్తానంటూ, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవడమే లక్ష్యంగా చెబుతూ విజయం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు.
తమిళగ వెట్రిక్ కళగం పార్టీ పేరుతో రాజకీయ రంగప్రవేశం చేసిన విజయ్, పార్టీ జెండా మరియు సిద్ధాంతాలను ప్రకటించారు. ఈ మహానాడు సభకు అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటలకు సభ మొదలవుతుందని ప్రకటించగా, ఉదయం నుంచే అభిమానులు తరలి వచ్చారు. 800 మీటర్ల ర్యాంప్‌పై తన అభిమానులను పలకరించిన విజయ్, ఫ్యాన్స్ విసిరిన కండువాలను భుజాన వేసుకుని వారి అభిమానాన్ని కంటికి కట్టినట్టు చూపించారు.తమిళనాడు రాజకీయాల్లో తాను ఎవరికీ A టీమ్‌గానీ, B టీమ్‌గానీ కాదని స్పష్టం చేశారు.విజయ్. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ చేస్తుందన్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న విజయ్, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ధీమాగా ప్రకటించారు. బీజేపీని సిద్ధాంతపరంగా, డీఎంకేని రాజకీయంగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. తమిళనాడులో రాజకీయ నాయకులు అధికారపక్ష అనుకూలంగా ప్రవర్తిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, డ్రావిడ మోడల్ పేరుతో అండర్‌గ్రౌండ్ డీలింగ్‌లు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
కామరాజ్ నాడార్, అంబేద్కర్ ఆశయాలకు మద్దతుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కామరాజ్ నాడార్, అంబేద్కర్ కటౌట్లు విజయ్ తీరునకు దర్పణంలా నిలిచాయి. మంచి పరిపాలనకు సూచికగా కామరాజ్ నాడార్, రాజ్యాంగానికి సంబంధించిన పథంలో నడుస్తామనే సంకేతం ఇస్తూ అంబేద్కర్ చిత్రాలను కూడా ప్రదర్శించడం ద్వారా తమిళనాడు రాజకీయాలకు కొత్త దారులు చూపించాలని విజయ్ సంకల్పించారు.
తమిళనాట సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత వంటి సినీ ప్రముఖులు సీఎం స్థాయికి ఎదిగిన నేపథ్యం ఉంది. అయితే విజయ్ ఈ ధోరణిని ఎన్ని మేరలు కొనసాగిస్తారో చూడాలి. వచ్చే ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించే అవకాశం ఉంది. విజయ్ ప్రత్యర్థిగా డీఎంకే యువ నాయకుడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఉదయనిధి, యూత్ ఐకాన్‌గా ఇప్పటికే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యే తీవ్రమైన రాజకీయ పోరు సాగనుంది.