
యంగ్ రెబల్ స్టార్ గా మన అందరికీ సుపరిచితమైన ప్రభాస్ ఈరోజు తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.1979 అక్టోబర్ 23న జన్మించిన ఆయన తన ప్రాథమిక విద్యను భీమవరం లోని డి.ఎన్.ఆర్ స్కూల్ లో పూర్తిచేసి, బి.టెక్ ను హైదరాబాద్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తిచేశాడు.
2002లో విడుదలైన ‘ఈశ్వర్’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు ప్రభాస్. 2004లో విడుదలైన ‘వర్షం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ‘ఛత్రపతి’ సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు పొందారు. ఆ తరువాత వచ్చిన ‘బిల్లా’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మిర్చి’ వంటి సినిమాలు అతనికి ఎంతో గుర్తింపుని ఇచ్చాయి.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 1′ &’ 2′ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘన విజయాన్ని సాధించాయి. ఇటీవల విడుదలైన ‘సలార్’ మరియు ‘కల్కి’ సినిమాలు మంచి హిట్ ను అందించాయి. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్’, ‘సలార్-2’, ‘కల్కి 2898 సీక్వెల్ ‘, ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నారు.
ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘ది రాజా సాబ్’ సినిమా మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ప్రభాస్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక సాధారణ మనిషిలా ఎంతో సింపుల్ గా ఉంటారు. తన సహనటులతో మరియు సిబ్బందితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.తన అభిమానులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు. అతను తరచుగా తన అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ, వారి అభిప్రాయాలను గౌరవిస్తారు.
ప్రభాస్ తన ప్రతిభ, కృషి, మరియు అభిమానుల పట్ల ప్రేమతో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో గా ఉన్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్డే ప్రభాస్!


