తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి ఏర్పాటైంది. బీఆర్ నాయుడు ఈ కొత్త టీటీడీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన ఈ కొత్త టీటీడీ పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ కొత్త పాలకమండలిలో ఎమ్మెల్యేలు, కేంద్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలు మరియు వివిధ రంగాల ప్రతినిధులు చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ఆనంద్ సాయి, తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణంలో చీఫ్ డిజైనర్‌గా పనిచేసి ప్రసిద్ధి పొందారు. అలాగే, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు కూడా టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2014-15 సంవత్సరాలలో జస్టిస్ హెచ్ ఎల్ దత్తు సుప్రీంకోర్టులో సేవలు అందించారు.
వైసీపీ ప్రభుత్వంలో పాలకమండలిలో సభ్యురాలిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ కొత్త పాలకమండలిలో కూడా పదవి పొందారు. ఆమె గత ప్రభుత్వంలోనూ టీటీడీ బోర్డు మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, జనసేన పార్టీ తరపున మహేందర్ రెడ్డి, ఆనంద సాయి మరియు రత్నం సతీమణి రంగశ్రీ కొత్తగా నియమితులయ్యారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు తన నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరియు ఎన్డీయే కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, తిరుమలలో తన పుట్టి పెరిగానని తిరుమల సంబంధిత విషయాలను తనకు బాగా తెలుసునని, టీటీడీ చైర్మన్ పదవితో బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు.ఈ కొత్త పాలక మండలి క్షుణ్ణంగా తిరుమలలో నిర్వహించాల్సిన పనులను అధ్యయనం చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందని బీఆర్ నాయుడు చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీఆర్ నాయుడుకు అభినందనలు తెలిపారు. టీటీడీ నూతన ఛైర్మన్, పాలకమండలి సభ్యులు తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను మరింతగా పెంచాలని ఆకాంక్షించారు.
టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా:
- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
- జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
- పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
- ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
- జాస్తి పూర్ణ సాంబశివరావు
- నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
- సదాశివరావు నన్నపనేని
- కృష్ణమూర్తి (తమిళనాడు)
- కోటేశ్వరరావు
- మల్లెల రాజశేఖర్ గౌడ్
- జంగా కృష్ణమూర్తి
- దర్శన్ ఆర్.ఎన్ (కర్ణాటక)
- జస్టిస్ హెచ్‌ఎల్ దత్ (కర్ణాటక)
- శాంతారామ్
- పి. రామ్మూర్తి (తమిళనాడు)
- జానకీ దేవి తమ్మిశెట్టి (మంగళగిరి)
- బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)
- అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
- బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
- సుచిత్ర ఎల్ల (తెలంగాణ)
- నరేశ్‌కుమార్ (కర్ణాటక)
- డా. అదిత్ దేశాయ్ (గుజరాత్)
- సౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)
జనసేన కోటా సభ్యులు:
- బూరగాపు ఆనందసాయి
- బూంగునూరు మహేందర్ రెడ్డి
- అనుగోలు రంగశ్రీ