తెలంగాణలో కులగణనకు సమగ్ర సర్వే ప్రారంభం కానుంది. నవంబర్ 6నుంచి ఈ సర్వే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు, ఇంకా 8,000 మంది ఇతర సిబ్బంది కులగణన కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సర్వేలో భాగంగా, ప్రాథమిక పాఠశాలలు ఈ సమయం పాటు ఒకే పూట నిర్వహించబడతాయి, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తరగతులు ఉంటాయి. సాయంత్రం ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి కులగణన సర్వే నిర్వహిస్తారు.
ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారిని కూడా నియమించబడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. సర్వే నిర్వహణలో 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించనున్నారు. సర్వే కిట్‌లు కూడా అందజేశారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ప్రకారం, ఈ సర్వే సకలజనుల సర్వేలాగానే కాకుండా, ప్రత్యేకంగా కులవారీగా గణన చేయడానికి ఏర్పాటు చేసినది. సర్వే పూర్తయిన తర్వాత రిపోర్ట్‌ను ప్రజల ముందుంచుతామని, దాచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన వెల్లడించారు.
కరీంనగర్‌లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ సందర్భంగా కొన్ని విభేదాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీసీ కమిషన్‌కు చట్టబద్ధత లేదని ఆరోపిస్తూ, ప్రజాభిప్రాయ సేకరణను ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన లేకపోవడంతో ప్రజాభిప్రాయ సేకరణను నామ్‌కేవాస్త్‌గా నిర్వహిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో, కుల సంఘాలు కూడా కులగణనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇంతకీ, ఈ కులగణన సర్వే ద్వారా కేవలం బీసీల సంఖ్య మాత్రమే కాకుండా, అన్ని కులాల జనాభా, వారి ఆర్థిక స్థితిగతులు, ఇతర వివరాలు సేకరించనున్నట్లు చెబుతున్నారు. ఎవరూ ఈ సర్వేను రాజకీయం చేయకూడదని, ప్రజల్లో అపోహలు రాకుండా ఉండాలని నిరంజన్ సూచించారు. దాదాపు 80 వేల నుండి 90 వేల మంది ఎన్యుమరేటర్లు ఈ సర్వేలో పాల్గొననున్నట్లు చెప్పారు.ప్రభుత్వం ఈ సర్వేను నవంబర్ 30 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.