తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: ప్రజా పాలన విజయోత్సవాల వేడుకలు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచనలు జారీ చేశారు.

ప్రజా పాలన విజయోత్సవాలకు “ప్రజా పాలన – ప్రజా విజయోత్సవం” అనే పేరును నిర్ణయించి, అన్ని జిల్లాల్లో పకడ్బందీగా ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను సచివాలయంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ముఖ్యమంత్రి బహిరంగ సభలు నిర్వహిస్తారు. మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, యువత ఎంపవర్‌మెంట్‌పై వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులకు సూచించారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సచివాలయం, నెక్లెస్‌రోడ్ ప్రాంతాల్లో విజయోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.

వెలుగులోకి వచ్చిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం అవసరమని సీఎం రేవంత్‌ సూచించారు. డిసెంబర్ 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇక సంబరాలు ప్రజల్లో ఆకర్షణీయంగా, విజయవంతంగా జరగాలనే లక్ష్యంతో, జిల్లాల వారీగా కట్టుదిట్టమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌ సూచించారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి