టాలీవుడ్‌లో తన విభిన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులకు పెద్ద సవాలుగా మారారు. వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో నవంబర్ 10న కేసు నమోదైంది. టిడిపి ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు, వర్మ తన “వ్యూహం” సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాలోకేష్‌ల ఫోటోలు మార్ఫింగ్ చేసి మహిళల ఫోటోలకు తలలు జత చేసి అవమానకర పోస్టులు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో మద్దిపాడు పోలీసులు నవంబర్ 13న వర్మ హైదరాబాద్ నివాసానికి వెళ్లి 41A నోటీసులు అందజేశారు. నవంబర్ 25న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే, వర్మ పోలీసులు ఇచ్చిన సమయానికి హాజరుకావడం లేదని తెలిసి ముందుగానే హైదరాబాద్ వెళ్లిన పోలీసులు అక్కడ కూడా అతనిని కనుగొనలేకపోయారు.
వర్మ ప్రస్తుతం కోయంబత్తూరులో “లూసిఫర్ 2” సినిమా షూటింగ్‌లో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్మ ఈనెల 23న ఎక్స్‌లో కోయంబత్తూరులో ఉన్నట్లు ఒక ఫోటో పోస్ట్ చేయడంతో ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఒంగోలు పోలీసులు ప్రత్యేక బృందాలను కోయంబత్తూరుకు పంపి చెన్నై పోలీసులతో కలిసి వర్మ కోసం గాలిస్తున్నారు. అయితే వర్మ అక్కడే ఉన్నారా? లేక మరో ప్రదేశానికి వెళ్ళిపోయారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
వర్మ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా, ఈ పిటిషన్‌పై నవంబర్ 26న విచారణ జరుగనుంది. వర్మకు బెయిల్ లభిస్తే విచారణకు హాజరవ్వడానికి అవకాశం ఉన్నా, లభించకపోతే వర్మ తన శైలిలో పోలీసులు నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రకాశం పోలీసులు మాత్రం వర్మను తప్పించనివ్వబోమని తేల్చి చెబుతున్నారు. వర్మ ఎక్కడున్నా అతన్ని అరెస్ట్ చేసి విచారణ కొనసాగించేందుకు ప్రతిపదులు కడుతున్నారు. వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట హాజరుకాకపోవడం, తన భౌతిక హాజరుకు బదులుగా వర్చువల్ విచారణకు అనుమతి కోరడం పోలీసులు ఎదుర్కొంటున్న సవాలును మరింత పెంచింది. మొత్తానికి, దీని ముగింపు ఎటువంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.