మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నేటి నుంచి వచ్చే రెండు రోజుల పాటు మహారాష్ట్రలో రోడ్‌ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం మీద, మహారాష్ట్రలో రెండు రోడ్‌ షోలు, ఐదు బహిరంగ సభల్లో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించనున్నారు.

నవంబర్‌ 16న మొదటి రోజు పర్యటనలో భాగంగా మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అదేరోజు నాందేడ్ జిల్లా డెగ్లూర్‌ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు, భోకర్, లాతూర్‌లలో కూడా ప్రసంగించనున్నారు. షోలాపూర్‌లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. నవంబర్‌ 17న చంద్రపూర్‌ జిల్లా బల్లార్‌పూర్‌లో సభలో పాల్గొనగా, సాయంత్రం పూణే కంటోన్మెంట్‌లో రోడ్‌ షోలో ప్రసంగిస్తారు. అనంతరం కస్భాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌ సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్డీయే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలలో విజయం సాధించిన పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్‌ చేసింది. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్‌ ప్రచారం నిర్వహించనున్నారు.

తిరుమల లడ్డూ వివాదం సమయంలో పవన్‌ సనాతన ధర్మ పరిరక్షణపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్‌ కావడం, ఆయనకు తెలుగు ప్రజల్లో ఉన్న ఆదరణ బీజేపీకి కలిసి వస్తాయని ఆశిస్తోంది. దీంతో పవన్‌ను ప్రచారానికి రంగంలోకి దించింది. మహారాష్ట్రలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి