రామ్ గోపాల్ వర్మపై కేసు విచారణలో కొత్త మలుపులు

టాలీవుడ్‌ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై ఇటీవల నమోదైన పోలీసు కేసు విచారణ కొత్త మలుపులు తీసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్‌(ట్విటర్‌)లో చేసిన పోస్టుల నేపథ్యంలో మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు వర్మపై ఈనెల 10న మద్దిపాడు పోలీసులు ఐటి యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో వర్మను ఈరోజు (నవంబర్‌ 19) విచారణకు హాజరు కావాలని మద్దిపాడు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. కానీ, ఇప్పటికే సినిమాలకు సంబంధించి బిజీ షెడ్యూల్‌ ఉన్నందున హాజరుకాలేకపోతున్నట్లు వర్మ తన తరపు లాయర్‌ ద్వారా పోలీసులకు రిక్వెస్ట్‌ లెటర్‌ పంపించారు. వారం రోజుల గడువు కోరుతూ ఆయన తన లాయర్‌ శ్రీనివాసరావును ఒంగోలు రూరల్‌ సీఐ శ్రీకాంత్‌బాబును కలిసి వివరణ ఇవ్వాలని పంపించారు.

హైకోర్టులో స్వ్యాష్‌ పిటిషన్‌ వేశాక, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం, విచారణకు వ్యక్తిగతంగా హాజరై సమయాన్ని కోరుకోవచ్చని సూచించడంతో వర్మ పోలీసుల ఎదుట నేరుగా హాజరయ్యే అవకాశం లేకపోయింది. ప్రస్తుతం వర్మ రిక్వెస్ట్‌ను పరిశీలిస్తున్న పోలీసులు ఆయన విచారణకు కొత్త తేదీ నిర్ణయించనున్నారు.

ఇదిలా ఉంటే, ఈ కేసు విచారణ వేగవంతం చేస్తోన్న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఇప్పటికే వర్మను ప్రశ్నించేందుకు ప్రత్యేక ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. వర్మపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో కేసు దర్యాప్తు మరింత వేగంగా ముందుకెళ్తోంది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి