NET 2024 Notification: తెలంగాణలో రెండోసారి టెట్‌ నోటిఫికేషన్‌.. నేడు నోటిఫికేషన్‌ విడుదల!

తెలంగాణలో టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షలకు సంబంధించిన తాజా నోటిఫికేషన్‌ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేవంత్‌ సర్కార్‌ హామీ ఇచ్చిన ప్రకారం, ఈ ఏడాది రెండోసారి టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. సోమవారం, నవంబర్‌ 4న టెట్‌ నవంబర్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి నెలలో ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మే 2024లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు, వారిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. అయితే, డీఎస్‌సీ నియామక ప్రక్రియ ఇటీవల పూర్తయిన నేపథ్యంలో, రెండో టెట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య కొంచెం తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ సారి జనవరిలో నిర్వహించబోయే టెట్‌ పేపర్‌ 1కు డీఈడీ (Diploma in Elementary Education) పూర్తి చేసిన అభ్యర్థులు, పేపర్‌ 2కు బీఈడీ (Bachelor of Education) పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వీలుంది. ముఖ్యంగా, స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందడానికి టెట్‌ అర్హత అవసరమని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల కారణంగా, వేలాది మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

టెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 9 సార్లు టెట్‌ పరీక్షలు నిర్వహించగా, ఈ జనవరిలో జరిగే పరీక్ష 10వదిగా నిలవనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 6 సార్లు టెట్‌ నిర్వహించగా, రేవంత్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండోసారి టెట్‌ పరీక్షను నిర్వహించడం విశేషం.

అయితే, టెట్‌ పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నా, డీఎస్‌సీ పోస్టుల సంఖ్య పరిమితంగా ఉండటంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డీఎస్‌సీ పోస్టుల సంఖ్యను పెంచితే టెట్‌ అర్హత పొందిన వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి