నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది: బాలీవుడ్ చిత్రంపై ప్రధాని మోదీ ట్వీట్

పొలిటికల్ డ్రామా నేపథ్యంతో రూపొందించిన బాలీవుడ్ చిత్రం ది సబర్మతి రిపోర్ట్ తాజా సంచలనంగా మారింది. విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిద్ది డోగ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ధీరజ్ శర్మ దర్శకత్వం వహించగా, ఏక్తా కపూర్ నిర్మించారు. 2002లో జరిగిన గోద్రా రైలు ఘటనను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు.

గోద్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, ఆ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాల అసలు నిజాలను ఈ సినిమా ఆధారంగా చూపించారు. ఈ సినిమా నవంబర్ 15న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.

ఈ చిత్రంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో గోద్రా ఘటనపై తనపై వచ్చిన విమర్శలను గుర్తుచేసుకుంటూ, “తప్పుడు కథనాలు తాత్కాలికమే, కానీ నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ సినిమాతో సామాన్యులకు నిజం తెలియజేసే అవకాశం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

గోద్రా రైలు దుర్ఘటనలో సుమారు 59 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత గుజరాత్‌లో పెద్దఎత్తున మతకల్లహాలు చెలరేగాయి. ఈ ఘటన ఆధారంగా రూపొందించిన ది సబర్మతి రిపోర్ట్ వివాదాస్పద గోద్రా సంఘటనను స్పష్టంగా చూపిస్తుందన్న అభిప్రాయంతో ప్రధాన మంత్రి చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మోదీ ప్రశంసలతో సినిమాపై ఆసక్తి పెరిగి, వసూళ్లలో పెరుగుదల కనిపిస్తున్నట్టు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి