మహానటి, సీతారామం తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. లక్కీ భాస్కర్ పేరుతో విడుదలైన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షో నుంచే హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. “తొలిప్రేమ”, “సార్” చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ ఈ సినిమాను కూడా ఫీల్‌గుడ్ ఎమోషన్స్‌తో తీర్చిదిద్దాడు. బ్యాంకింగ్ రంగం, స్టాక్ మార్కెట్, మధ్యతరగతి భారతీయుల జీవన శైలిని హృదయానికి హత్తుకునేలా చూపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు.
సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి బరిలో ఉన్న అమరన్, క, వంటి చిత్రాలను అధిగమించి భారీ వసూళ్లు సాధించింది. దుల్కర్ నటన, సినిమా లోని భావోద్వేగాలు ప్రేక్షకులను మెప్పించాయి. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా, నవంబర్ 28న “లక్కీ భాస్కర్” సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు సహా హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనున్న ఈ సినిమా అందరి హృదయాలను మరింతగా దోచుకోనుంది. “అదృష్టం మనిషిని ఎంత దూరం తీసుకెళుతుందో చూడండి” అంటూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.