తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన హయాంలో చేపట్టిన విజయవంతమైన పథకాలను వివరించారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామనీ, ఈ పథకం కింద చికిత్సల పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచినట్లు చెప్పారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ ఆరోగ్యశ్రీ బిల్లులను ఆరు నెలలుగా పెండింగ్‌లో పెట్టి, ప్రజలకు అందవలసిన సేవలను నిలిపివేసిందని ఆరోపించారు.
తమ ప్రభుత్వం హయాంలో 1.30 లక్షల ఉద్యోగాలను సృష్టించామని, ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారి జీవితాలను మెరుగుపరచామని తెలిపారు. 2.66 లక్షల వలంటీర్ల నియామకం ద్వారా గ్రామస్థాయి సేవలను బలపరిచామని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగాన్నైనా ఇచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలను నిర్వీర్యం చేయడమే కాకుండా, ప్రజల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు.
హౌసింగ్ పథకం విషయంలో వైఎస్సార్‌సీపీ హయాంలో 9 లక్షల 2వేల ఇళ్లను పూర్తిచేశామని, ఇంకా 11 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని జగన్ వివరించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ పథకం పూర్తిగా నిలిచిపోయిందని, ప్రజల అవసరాలు పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క నిరుపేదకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, కానీ తమ హయాంలో లక్షలాది ఇళ్లను అందించామని చెప్పారు.
ప్రస్తుత బడ్జెట్ విషయంలో కూడా జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. బడ్జెట్ పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందని, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు పొంతన లేకుండా ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2019 నాటికి చంద్రబాబు పాలనలో రూ. 3.13 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులు రూ. 6.46 లక్షల కోట్లకు చేరినా, ప్రభుత్వం గ్యారంటీ మీద అప్పులు తక్కువగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మాఫియా ముఠాలు విజృంభిస్తున్నాయని, ఇసుక, మద్యం, పేకాట స్కాంలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని జగన్ ఆరోపించారు. తమ హయాంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులను కట్టడి చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని మరలించేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ ప్రయోగాలతో భయానిక పరిస్థితులు సృష్టిస్తున్నారని జగన్ అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేయడం, సెన్సార్ బోర్డ్ అనుమతితో తీసిన సినిమాలపైనా కేసులు పెట్టడం వంటి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేసిన తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలకు మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో చేపట్టిన పనులు ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పనులను నిలిపివేసి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని జగన్ తీవ్రంగా విమర్శించారు.