లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ ఈవెంట్‌ – రామ్ చరణ్ మాస్ లుక్ తో హైప్‌ మామూలుగా లేదు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కోసం చరణ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు దసరా, దీపావళి పండుగలకు టీజర్ విడుదల అవుతుందనే ఊహాగానాలు ఉన్నప్పటికీ, అది జరగలేదు. కానీ ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ ఖరారైంది.

సినిమా మేకర్స్ ప్రకారం, నవంబర్ 9న లక్నోలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో టీజర్ విడుదల కానుంది. దీపావళి పండుగ సందర్భంగా టీజర్ రిలీజ్ డేట్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. రామ్ చరణ్ మాస్ లుక్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లుంగీ, బ్లాక్ బనియన్ ధరించి, స్టైలిష్ గా కళ్లకు సన్ గ్లాసెస్ తో రైలు పట్టాల మధ్య కూర్చుని కనిపిస్తారు. చరణ్ ముందు కొందరు గూండాలు పడిపోవడం ఈ పోస్టర్ లో చూడవచ్చు. ఇది సినిమా మీద ఉన్న అంచనాలను మరింతగా పెంచింది.

ఈ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కాబోతోంది. గేమ్ ఛేంజర్ విడుదలవడానికి అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సముద్రఖని, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో భాగం అయ్యారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి