ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తూ విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కొత్త మార్గాలను అనుసరిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, విద్యార్థుల కోసం ఈ పథకం అమలుపై కీలక మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
ఇంతకాలం తల్లి ఖాతాలకు చెల్లింపులు జరిపే విధానం ఉన్నప్పటికీ, దీనివల్ల ఫీజుల ఎగవేత, ఇతర సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. గతంలో తల్లి-విద్యార్థి జాయింట్ ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్యలన్నిటికి స్వస్తి పలికేలా ఇకపై ఫీజులను నేరుగా కాలేజీల యాజమాన్యాల ఖాతాలకు మళ్లించే విధానం తీసుకురాబోతున్నామని తెలిపారు.
పీజీ చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాలనే అంశంపై ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం ఫీజులు, మెస్ ఛార్జీలను సగం కూడా చెల్లించలేదని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. ఇకపై ఈ విధానం మారబోతుందని, విడతల వారీగా విద్యార్థుల బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
విద్యార్థుల సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉందని, న్యాయమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా విద్యార్థులకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల కోసం చేపడుతున్న ఈ చర్యలు వారి భవిష్యత్తు నిర్మాణంలో సహాయకరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.