సాంకేతికత పురోగతితో ప్రపంచం కొత్త మార్గాల్లో పయనిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో డ్రోన్ టెక్నాలజీ వాడకాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం. డ్రోన్లను హెల్త్ కేర్ సేవల్లో వినియోగించడం ద్వారా అత్యవసర సమయంలో రక్త సేకరణ, మెడిసిన్ సరఫరా వంటి సేవలను వేగంగా, సమర్థవంతంగా అందించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలు వైద్యరంగంలో కొత్త ఒరవడులు సృష్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా మొత్తం 11 ఎయిమ్స్‌లలో డ్రోన్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్‌లో కూడా ఈ సేవలను వర్చువల్‌గా ప్రారంభించారు. డ్రోన్ల వినియోగం ద్వారా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సహాయం అందించడమే లక్ష్యం.
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌లో మొదటిసారి డ్రోన్ సేవలను పరీక్షించారు. ప్రధాని ప్రారంభించిన వెంటనే ఎయిమ్స్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డ్రోన్ ద్వారా రక్త నమూనాలను పంపి తిరిగి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ ప్రయోగం ద్వారా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు కూడా సమర్థవంతమైన వైద్య సేవలను అందించవచ్చని వైద్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ కూడా ఈ డ్రోన్ సేవల కార్యక్రమంలో భాగమైంది. అక్కడి రోగులకు కూడా అత్యవసర వైద్య సేవలను డ్రోన్ల ద్వారా అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ విధంగా డ్రోన్ల వినియోగం ద్వారా వైద్య రంగంలో కొత్త పుంతలు తొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.