క్రికెట్ రారాజు కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు

నవంబర్ 5, 2024 న చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ తన 36వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నాడు. గత ఏడాది సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డును అధిగమించిన విరాట్, ఇప్పుడు అత్యధిక వన్డే సెంచరీల రారాజుగా నిలిచాడు. ఈ ఘనతతో పాటు, విరాట్ తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరుకు లిఖించుకున్నాడు.

విరాట్ క్రికెట్ ప్రేమికులకు ఒక స్ఫూర్తి. అతని ఆటతీరు, దూకుడుతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆకట్టుకున్నాడు. అద్భుతమైన ఆటతీరు, రికార్డుల దిశలోనూ విరాట్ తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు. వన్డేలు, టెస్టులు, టీ20లలో విశేషమైన ప్రదర్శనతో దూసుకెళ్లిన అతను ఐపీఎల్‌లోనూ తన మార్కును చూపించాడు. 2016 సీజన్‌లో 973 పరుగులు సాధించిన కోహ్లీ ఈ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచింది.

1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించిన విరాట్, తన తొలి రోజుల్లో కోచ్ రాజ్‌కుమార్ శర్మ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందాడు. 2008లో అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన అతను జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు తన ఆటతో దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చాడు.

అతనికి అనేక పురస్కారాలు లభించాయి. 2013లో అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం అందుకున్నాడు. ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ సహా అనేక అంతర్జాతీయ అవార్డులు అతనిని వరించాయి. ఈరోజు విరాట్ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీకి తెలుగు వైబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి