ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: పరిశ్రమల అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమవుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024కు ఆమోదం తెలపడం ద్వారా భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. అలాగే, సీఎన్‌జీపై వ్యాట్‌ను 5 శాతానికి తగ్గించడం ప్రజలకు నేరుగా ఉపశమనం కలిగించే నిర్ణయంగా నిలిచింది.

విశాఖపట్నం, విజయవాడ మెట్రో డీపీఆర్‌లకు ఆమోదం తెలపడంతో పాటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి ‘సూపర్‌ సిక్స్‌ హామీల’పై కేబినెట్‌ చర్చ జరిపింది. రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడుల దిశగా ఎస్‌ఐపీబీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. నేరాల నియంత్రణ కోసం పీడీయాక్ట్‌ పటిష్టతకు సంబంధించిన సవరణ బిల్లుకు ఆమోదం ఇవ్వడం ద్వారా శాంతి భద్రతలపై దృష్టి పెట్టినట్లు స్పష్టమైంది. లోకాయుక్త చట్ట సవరణ, దేవాలయ కమిటీలలో సభ్యుల నియామకానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోబడాయి.

కర్నూలు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు, గంజాయి, డ్రగ్స్‌ మత్తు వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు యాంటీ నార్కొటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ను ‘ఈగల్‌’గా పేరు మార్చి ఎలైట్‌ విభాగంగా పటిష్టం చేయాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పునరుద్ధరణతో పాటు ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్‌గ్రిడ్‌లో విలీనం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

అమరావతి నిర్మాణ పనుల కోసం సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటు కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకోవడం రాజధాని అభివృద్ధికి ఉత్సాహాన్నిచ్చే అంశం. టూరిజం పాలసీ, స్పోర్ట్స్‌ పాలసీకి ఆమోదం తెలపడం ద్వారా ఈ రంగాలకు ప్రోత్సాహం లభించనుంది. పంచాయతీరాజ్‌ శాఖలో అవిశ్వాస తీర్మానాల గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ తీసుకున్న నిర్ణయం గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను సృష్టించనుంది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి