వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు భారీషాక్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నాగ చైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ తరువాత వారికి విడాకులు తప్పవని ఆయన చెప్పిన జ్యోతిష్యం పెద్ద వివాదంగా మారింది. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేయగా, ఈ కేసు హైకోర్టులోకి చేరింది.

నాగ చైతన్య-శోభితలు ఇటీవల ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక అనంతరం వేణు స్వామి, సమంత-చైతన్య విడాకుల తరహాలోనే చైతన్య-శోభితలు కూడా విడిపోతారనే జ్యోతిష్యం చెప్పడంతో తీవ్ర వివాదం నెలకొంది. ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ దీనిపై తీవ్రంగా స్పందించి, వేణు స్వామి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

వేణు స్వామి, తనను విచారించేందుకు మహిళా కమిషన్‌కు హక్కులేదని హైకోర్టును ఆశ్రయించారు. తొలుత ఆయనకు హైకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ, తాజాగా హైకోర్టు ఆ స్టేను ఎత్తివేసింది. వేణు స్వామిని విచారించేందుకు మహిళా కమిషన్‌కి పూర్తి అధికారం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. వారం రోజుల్లో వేణు స్వామిపై చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు సూచించింది.

వేణు స్వామి గతంలో కూడా సమంత-చైతన్య విడాకులు ఉంటాయనే జ్యోతిష్యం చెప్పి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మళ్లీ నాగ చైతన్య-శోభితల గురించి జోస్యం చెప్పి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయన జ్యోతిష్యం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ, ఇప్పుడు న్యాయపరమైన సమస్యలను కలిగించింది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి