త్వరలో ‘వికటకవి’ అనే సరికొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ద్వారా ఈ సిరీస్ నవంబర్ 28న తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ను టాలీవుడ్‌లోని ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా, నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన మొట్టమొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని అమరగిరి అనే ఊరిపై ఓ శాపం పడుతుంది. గత 30 సంవత్సరాలుగా ఈ శాపం ఆ ఊరిని పీడిస్తోంది. డిటెక్టివ్ రామకృష్ణ తన తెలివితేటలతో ఈ శాపం వెనుక ఉన్న నిజాలను, పురాతన కథలను, అలాగే ఆధునిక కుట్రలను బయటపెడతాడు. ఈ కథలో రామకృష్ణకి అమరగిరి ప్రాంతంతో ఉన్న అనుబంధం ఏమిటి? అతడు ఎదుర్కొనే సవాళ్లు ఏంటన్నది ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే అంశాలు.
అజయ్ అరసాడ సంగీతాన్ని సమకూర్చగా, షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందించారు. ‘వికటకవి’ పోస్టర్ విడుదల కావడంతో, నల్లమల అడవిలో ఇద్దరూ దేని కోసం సెర్చ్ చేస్తున్నట్లుగా చూపించడం ద్వారా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఈ వెబ్ సిరీస్ అందించిన కొత్త కథ, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు.
సినిమా ప్రేమికులు, ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ అభిమానులు ఈ వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ‘వికటకవి’ సిరీస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో, నవంబర్ 28న జీ5లో చూడాల్సిందే.