
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ఆయన ప్రశ్నించారు.
నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి చంద్ర శేఖర్ రెడ్డి పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ, “కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. 40 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య” అని ఆయన పేర్కొన్నారు.
“మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని నారాయణ గారు తెలుసుకోవాలి. రకరకాల జీవోలు తీసుకువచ్చి వైసీపీ అభ్యర్థుల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.


