అందుకే వాడిని చంపేశా: యూట్యూబర్ సంచలన వీడియో

ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంపై ఒక తండ్రి చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును హతమార్చి, ఈ చర్యకు కారణాన్ని కువైట్ నుంచి సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన ఘటన సంచలనంగా మారింది.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగపేట గ్రామంలో నివసిస్తున్న ఆంజనేయులు (59) అనే దివ్యాంగుడు కొద్ది రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి కువైట్‌లో ఉన్న ఆంజనేయ ప్రసాద్ అనే యూట్యూబర్ వీడియోలో హత్య చేసినట్లు అంగీకరించారు.

ఆంజనేయ ప్రసాద్ కుటుంబం కువైట్‌లో ఉంటూ, తన 12 ఏళ్ల కూతురిని స్వగ్రామంలోని చెల్లెలి వద్ద ఉంచారు. అయితే చెల్లెలి మామ, బాలికకు మనవరాలి వరస అయ్యే వ్యక్తి ఆ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు.ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్‌ చేసి తెలిపింది. తల్లి వెంటనే చెల్లెలికి ఫోన్‌ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఈ అంశంపై ఆందోళన చెందిన తల్లి కువైట్‌ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు నిందితుడిని పిలిపించి మందలించి వదిలేశారు.ఈ పరిస్థితిని భర్తకు వివరించగా, ఆడపిల్లపై అసభ్యంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటి అని ఆంజనేయ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కువైట్ నుంచి వచ్చి ఆ దివ్యాంగుడిని ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హతమార్చాడు.

హత్య అనంతరం తిరిగి కువైట్ వెళ్లిపోయిన ఆంజనేయ ప్రసాద్, తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో తన కూతురి పట్ల జరిగిన అన్యాయానికి చట్టం న్యాయం చేయలేదని, అందుకే తాను హత్య చేసినట్లు పేర్కొన్నాడు.

తాజాగా ఆంజనేయ ప్రసాద్, ఆయన భార్య ఇటీవల చెన్నైకి వచ్చినట్లు సమాచారం. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. స్టేషన్‌కి వచ్చి లొంగిపోతానని ప్రకటించినప్పటికీ, ఇంకా ఆయన ఆచూకీ లభించలేదు. పోలీసుల నిర్లక్ష్యం, ఒక తండ్రి ఆవేదన ఈ కేసును రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి