విశాఖపట్నం టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆధ్వర్యంలో డీప్ టెక్ సమ్మిట్ 2024 విశాఖ వేదికగా జరగనుంది. ఈ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఈ సదస్సు ద్వారా రాబోయే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్ రూపొందించే అవకాశం ఉంది.
హెల్త్ రంగం, చిన్నతరహా పరిశ్రమల వృద్ధి వంటి ముఖ్య అంశాలను ఈ సదస్సు దిశానిర్దేశం చేయనుంది. 2047 నాటికి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. టెక్నాలజీ విప్లవానికి భారత్ కేంద్రస్థానంగా మారుతున్న నేపథ్యంలో డీప్ టెక్ సమ్మిట్ కీలక పాత్ర పోషించనుంది.
సమావేశం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు అవసరమైన టెక్నాలజీ పరిష్కారాలను అందించడంలో దోహదపడనుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల ప్రోత్సాహంతో రాష్ట్రం గ్లోబల్ డీప్ టెక్నాలజీ హబ్‌గా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, ఐటీ రంగంలో ప్రగతిపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
సమ్మిట్‌లో పాలసీ మేకర్స్, ఇండస్ట్రీ లీడర్స్ పాల్గొనడం ద్వారా కొత్త ఆవిష్కరణలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం డీప్ టెక్ సమ్మిట్ ప్రాంగణంలో ఎక్కువ సమయం గడపనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం అభివృద్ధి పనులపై సమీక్ష, ముఖ్య నాయకులతో సమావేశాలు కూడా జరగనున్నాయి.