నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్: 1.35 లక్ష కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక విస్తరణ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి దిశగా ముఖ్యమైన అడుగులు వేసింది. కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన తర్వాత, కూటమి సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ చేయడం, భూమి కేటాయించడం, ప్రాజెక్టు పూర్తి చేసే డెడ్‌లైన్‌ను విధించడం వంటి చర్యలు తీసుకుంది.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్‌ సెల్లార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ ఇండియా సంయుక్తంగా ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షా 35 వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. ప్రథమ దశలో 2 వేల 200 ఎకరాలు కేటాయించి, రెండో దశ కోసం 3 వేల 800 ఎకరాల భూమిని సేకరించేందుకు ఏపీఐఐసీకి ఆదేశాలు ఇచ్చింది. 440 ఎకరాలు టౌన్‌షిప్ ఏర్పాటుకు కేటాయించబడ్డాయి. ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్యాకేజీని ప్రకటించింది. మొదటి దశ 2029 జనవరి నాటికి పూర్తవ్వాలని, రెండో దశ 2033 నాటికి పూర్తవ్వాలని గడువు విధించింది.

ఈ ప్రాజెక్టులతో పాటు, 11 వేల 198 కోట్లతో క్యాప్టివ్‌ పోర్టును నిర్మించేందుకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ పోర్టు ద్వారా 2 బల్క్‌ బెర్తులు మొదటి దశలో, 4 బల్క్‌ బెర్తులు రెండో దశలో ఏర్పాటు చేయబోతున్నారు. మరో 3, 6 మల్టీపర్పస్‌ బెర్తులు కూడా ప్రణాళికలో ఉన్నాయి. పోర్టు నిర్మాణానికి 148.26 ఎకరాలు మొదటి దశకు, 168 ఎకరాలు రెండో దశకు కేటాయించబడ్డాయి. ప్రథమ దశ 5 వేల 816 కోట్లు, రెండో దశ 5 వేల 382 కోట్లు ఖర్చు కానున్నాయి.

ఈ ప్రాజెక్టులతో ఏపీ సర్కార్ 60 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ప్రాజెక్టు వేగంగా పూర్తి అవ్వాలని, దానిపై ప్రత్యేక అధికారిని నియమించింది ప్రభుత్వం.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి